లాక్‌డౌన్ నియ‌మం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు సీఎం యోగి దూరం

త‌న తండ్రి ఆనంద్ సింగ్ భిష్త్ మృతి ప‌ట్ల ఇవాళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అయితే రేపు జ‌ర‌గ‌బోయే తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని సీఎం యోగి తెలిపారు. క‌రోనా వైర‌స్‌పై తీవ్ర పోరాటం చేస్తున్న నేప‌థ్యంలో.. తండ్రిని క‌డ‌సారి చూసుకోలేక‌పోతున్న‌ట్లు సీఎం చెప్పారు. చివ‌రి నిమిషాల్లో తండ్రితో గ‌డ‌పాల‌నుకున్నా, కానీ యూపీ ప్ర‌జ‌ల‌ను రక్షించాల‌న్న బాధ్య‌త‌తో వెళ్ల‌లేక‌పోతున్న‌ట్లు చెప్పారు.  లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకావ‌డం లేద‌న్నారు.  క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఈ చ‌ర్య త‌ప్ప‌ద‌న్నారు.  నా త‌ల్లికి, నా కుటుంబ‌సభ్యుల‌కు కూడా నేను ఇదే అభ్య‌ర్తిస్తున్నాను, ఎవ‌రూ కూడా లాక్‌డౌన్ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌రాదంటూ యూపీ సీఎం యోగి తెలిపారు.


లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత స్వంత ఇంటికి వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు.  ఉత్త‌రాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఉన్న స్వ‌గ్రామంలో యోగి తండ్రి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.  కేంద్ర మంత్రి స్ముతి ఇరానీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ‌ద్రా, అఖిలేశ్ యాద‌వ్‌లు.. సీఎం యోగి తండ్రి మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు.